Thursday, December 30, 2010

VEERA SAVARKAR

"భారత స్వాతంత్ర సమరయోధులు అనగానే గాంధి, నెహ్రు, ఆజాద్, చంద్రబోసు, భగత్ సింగ్   పేర్లు సాధారణంగా గుర్తుకొస్తాయి. ఇంకా కొంచెం కష్టపడితే మరొక 5 గురి పేర్లు, మరి కొంచెం ప్రయత్నిస్తే మరో 3 గురి పేర్లు.. ఇంకా కష్టపడలేము, ఎందుకంటే 3 వ తరగతి నుండి ఇంటర్, డిగ్రీ ప్రతి సంవత్సరం, ప్రతి ఆగస్టు 15..  జనవరి 26 న వీరి గురించే విని విని మనము, చెప్పి చెప్పి వారు ఫార్మాలిటీ గా ప్రక్రియ ముగించుకుంటాం కనుక.
        అయితే మనకు తెలియని మనం తెలుసుకోవాల్సిన స్వాతంత్ర సమరయోధులు ఎందఱో ఉన్నారు.., ఇంతటి స్వాతంత్ర్యం   మనకు రావటానికి కారకులైన వారి గురించి కొద్దిగా తెలుసుకొని వారి త్యాగానికి జేజేలు తెలుపుతూ, మనము వారినుంచి  స్ఫూర్తి ని పొందుదాం."


                                                            వీర  సావర్కార్ 
                

                                     1910 సం జులై 10 వ తేది, సూర్యోదయం అవుతున్న సమయం. ఫ్రాన్స్ లో మార్సేల్స్ రేవుపట్నం లో మొరియో అనే ఓడ లంగరు వేసుకొని నిలబడి ఉంది. దానిలో ఏదో యాంత్రిక లోపం ఏర్పడింది. ఓడ సిబ్భంది ఆ లోపాన్ని సరిదిద్దే హడావిడిలో ఉన్నారు. సముద్రం ప్రశాంతంగా ఉంది, ప్రయాణికులు ప్రశాంతంగా ఉన్నారు,  అయితే ఈ వాతావరణం లో ఇమడకుండా ఒక యువకుడు ఏవేవో లెక్కలు వేసుకుంటున్నాడు. నిశ్చింతగా ఉండటం అతనికి సాధ్యం కాదు ఎందుకంటే అతడు  బందీగా ఉన్నాడు అది కూడా ఆంగ్ల ప్రభుత్వానికి... అతడి పైన రాజద్రోహం నేరం మోపబడి ఉంది. అతని కదలికలను అనుక్షణం కనిపెడుతూ ఇద్దరు పోలీసులు కాపలా కాస్తున్నారు కూడా. 'నేను బయటకు వెళ్ళాలి' అన్నాడు బందీ, ఒక పొలిసు అతనిని మరుగుదొడ్డి దగ్గరకు తీసుకు వెళ్ళాడు. బందీ లోపలికి  వెళ్లి తలుపు వేసుకున్నాడు, బయట ఇద్దరు పోలీసులు కాపలా కాస్తున్నారు, మరుగుదొడ్డి గుమ్మానికి పైన అద్దాల కిటికీ ద్వారా లోపల ఉన్న బందీ కదలికలు పసిగట్టచ్చు. లోపలకు వెళ్ళిన బందీ తన కోటు విప్పి అద్దానికి అడ్డంగా తగిలిచ్చాడు. మరుక్షణం ఉహించలేని విధంగా మరుగుదొడ్డి రంధ్రం నుండి సముద్రం లో కి జారిపోయాడు. కెరటాలతో పోరాటం చేస్తూ ఒడ్డుకు ఈదుకుంటూ పారి పోయాడు. "పారి పోతున్న బందీ పేరు సావర్కర్".
                     1883 వ సం మే 28 న మాహారాష్ట్ర  లోని నాసిక్ లో దామోదర్ పంత్, రాధాబాయి దంపతులకు  వినాయక దామోదర్ సావర్కర్ జన్మించాడు. అప్పటికే వారికి గణేష్ దామోదర్ సావర్కర్ అని అబ్బాయి ఉన్నాడు. సమాన అర్ధం వచ్చే పేర్లు గల ఈ అన్నదమ్ములిద్దరూ దేశ కార్యాలలో కూడా సమానంగా పాల్గొని తమకు సమాన పేర్లు పెట్టడానికి సార్ధకత కల్పించారు.  
                     "మిత్ర మేళ" అనే సంస్థ ను స్థాపించి దానిద్వారా వ్యాయామశాల, గణేష్ పూజ, శివాజీ జయంతి లాంటి సార్వజనిక ఉత్సవాలు నిర్వహిస్తూ అందరిని చైతన్యవంతుల్ని చేస్తూ చిన్నతనంనుంచే స్వాతంత్ర్యం కోసం పాటుపడ్డారు. దేశ స్వాతంత్ర్యం కోసం  సాయుధ పోరాటమే సరైన మార్గమని తలచిన సావర్కర్ "అభినవ భారత్" అనే సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్నాడు. లండన్ లో న్యాయ శాస్త్రం చదివిన సావర్కర్ అక్కడ చదువుతున్న సమయంలో కూడా "ఇండియా హౌస్" అనే సంస్థ ద్వారా స్వాతంత్ర్య కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. లండన్ నుంచే 1857 ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామం గురించి పుస్తకం వ్రాసిన సావర్కర్ ఆ పుస్తకాన్ని ఇండియా లోని తన అన్నకి పంపించాడు. అయితే ఆ విషయం తెలిసిన ఆంగ్ల ప్రభుత్వం గణేష్ సావర్కర్ ను బంధించి జీవిత ఖైదు విధించింది. మదన్లాల్ ధింగ్ర లాంటి సావర్కర్ స్నేహితులు పోరాటం లో మరణించారు. అయితే ఇక లండన్ లో ఉండటం ఇష్టం లేక తిరిగి భారత్ వచ్చే ప్రయత్నం లో సావర్కర్ ఆంగ్లేయులకు దొరికిపోయాడు. బ్రిటిష్ ప్రభుత్వం సావర్కర్ కి మునుపెన్నడూ లేని రీతిలో 2 రెట్లు  జీవిత ఖైదు శిక్ష గ విధించింది. ఒక జీవిత ఖైదు అంటేనే 25 సం ల కటిన కారాగారం, అలాంటిది 50 సం లు శిక్ష విధించినది బ్రిటిష్ ప్రభుత్వం. అయితే 1922 లో సావర్కర్ ని విడుదల చేసి గృహనిర్భందం చేసింది. 13 సం లు గృహనిర్భందం లో మ్రగ్గిన సావర్కర్ ఆ తర్వాత కూడా ఎన్నో శిక్షలకు గురయ్యాడు . 1948 లో గాంధీ హత్య కేసు లో విచారణకు గురి అయిన సావర్కర్ నిరపరధిగా నిరుపించాబడ్డాడు. 
           1964 సం లో భారత ప్రభుత్వం సావర్కర్ కు "అప్రతిహతీ స్వతంత్ర్యవీర" అనే బిరుదును ప్రదానం చేసింది. భారత్ పాకిస్తాన్ విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన సావర్కార్ 1966 సం ఫిబ్రవరి 26 న మృతిచెందారు.

GALLERY 



savarkar's signature


savarkar with his team


savarkar at the age of 80


  

Monday, December 27, 2010

CHITHURI NAGAYYA

వి. చిత్తూరి నాగయ్య 


       డిసెంబర్ 30 న నాగయ్య గారి వర్థంతి సందర్భంగా......!!!!!!! 

       ప్రముఖ చలన చిత్ర నటులు, దర్శకులు  శ్రీ వుప్పలదడియం చిత్తూరి నాగయ్య గారు మార్చి 28 1904 న గుంటూరు జిల్లా రేపల్లె లో ఒక సద్బ్రాహ్మణ కుటుంబము లో రామలింగ శర్మ మరియు వెంకట లక్ష్మాంబ అను పుణ్యదంపతులకు  జన్మించారు. తిరుపతి దేవస్థానం అందించిన స్కాలర్ షిప్ సహాయంతో చిత్తూరు లో డిగ్రీ పొందారు. మొదటగా గవర్నమెంట్ ఆఫీసులో చిన్న క్లర్క్ గా  పనిచేసిన నాగయ్య గారు, ఆ తరువాత "ఆంధ్ర పత్రిక" జర్నలిస్టుగా కొద్దికాలం పనిచేసారు.
       చిన్నతనం నుంచే నాటకాల పట్ల ఆకర్షితుడైన నాగయ్య గారు సారంగధర, విశ్వామిత్ర, చిత్రనళీయం, సావిత్రి, బృహన్నల, రామదాసు తదితర నాటకాల లో ప్రధాన భూమిక పోషిస్తూ పలు బహుమానాలు, సన్మానాలు అందుకున్నారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు . 
       ప్రప్రధమంగా "గృహలక్ష్మి" అనే చిత్రం లో నటించి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. అ చిత్రం లో ని "కల్లు మానండోయ్ బాబూ, కళ్ళు తెరవండోయ్ బాబూ" పాట శ్రీ నాగయ్యకు విశేష కీర్తి ని తెచ్చిపెట్టింది .
      నటుడిగా తెలుగు, తమిళ మరియు కన్నడ చిత్రాల్లో ఎన్నో పాత్రలతో జనాల్ని మెప్పించిన నాగయ్యగారు త్యాగయ్య, రామదాసు, నా ఇల్లు సినిమాలకు దర్శకత్వం వహించారు. త్యాగయ్య చిత్రనిర్మాణం చేపట్టి ఆయనే స్వయంగా ఆ చిత్ర దర్శకత్వం, సంగీత దర్శకత్వం వహించి నేపధ్య గాయకుడిగా, త్యాగయ్య గా కూడా నటించి - తన బహుముఖ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. అయితే త్యాగయ్య చిత్రం నాగయ్య గారికి  ఆర్థికంగా ఏమి లాభం చేకూర్చలేదు. అలాగే ఆయన స్వయంగా నిర్మించిన  రామదాసు చిత్రం ఎనలేని కీర్తి ని తెచ్చిపెట్టింది . 
       నాటి కొద్దిమంది, నేటి ఎంతోమంది  దర్శకులలాగా జనాల్ని "మురిపించని,మరిపించని " నాగయ్యగారి దర్శకత్వం, చిత్ర నిర్మాణ విధానం..,  కమర్షియల్ చేయటం కోసం, ప్రేక్షకులని ఆకర్షించటం కోసం  యదార్ధాన్ని తప్పుదోవపట్టించని నిజాయితీ, పని లో ఖచ్చితత్త్వం మాటలో మృదుత్వం నాగయ్య గారికి ఎన్నో కీర్తిప్రతిష్టలు, అవార్డులని తెచిపెట్టాయి, ఆర్ధిక నష్టాన్ని కల్గించాయి. రామదాసు, త్యాగయ్య చిత్రాలు ఆర్థికంగా బాగా నష్టం కలిగించాయని చిత్ర నిర్మాణ పరిశీలకులు పేర్కొంటారు. 
     శ్రీ నాగయ్య గారు 72 ఏళ్ళు జీవిస్తే, అందులో సుమారు ఐదు దశాబ్దాలు నాటక, సంగీత, సినీ చిత్ర రంగాలకే అంకితం చేశారు. మైసూరు, తిరువాన్కూరు రాజుల సన్మానం, కేంద్ర ప్రభుత్వం నుండి "పద్మశ్రీ" బిరుదు అందుకున్నారు. తను సంపాదించిన దానిలో ఎక్కువభాగం దాన ధర్మాలకే వెచ్చించిన ఆదర్శ తెలుగు చలన చిత్ర నటులు, త్యాగశీలి, నిరాడంబరుడైన శ్రీ నాగయ్య గారు 1973 డిసెంబరు 30 న మద్రాసులో మరణించారు.  
          
 
                                          

Sunday, December 26, 2010

MAHANATI SAVITRI

MAHANATI SAVITRI
15.9.1931 నాడు, స్వర్గీయ H.M.Reddy Banner క్రింద తొలి తెలుగు టాకీ సినిమా విడుదల ఐంది! నాటి నుండి నేటి వరకు ఎందరో మహా నటులు నటీమణులు తమ ప్రతిభ తో తెలుగువారినే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించారు.నాటి నుండి నేటి వరకు ఎందరో ప్రవేశించి, వెళ్లి పోయినా, తెలుగు నటీమణుల పేర్లు తలచుకోగానే గుర్తుకు వచ్చే మొదటి పేరు...సావిత్రి!
మాటలతో అవసరం లేకుండా మనసులోని భావాలను ప్రేక్షకుల మనసులలోకి సూటిగా నాటిన మహా నటీమణిగా,కేవలం తన కనుబొమల కదలికలతో,కనులలోని మెరుపుతో,పెదవి విరుపుతో, కదలికలలో నాట్యంతో ,కట్టిపడేసే లాస్యంతో, అనన్య సాధ్యమైన ఆంగిక అభినయానికి , సుమధురమైన సుస్పష్టమైన వాచికానికి, ఆహార్యంతో నిమిత్తం లేని నటనకు భాష్యంగా, అభినయ విద్యకు ' బడి 'గా,కాలపు పరదాల మాటున మరుగుపడని పాత్రల పలుకుబడిగా,తెలుగు సినిమా నిలిచి ఉన్నంత కాలమూ అభిమానుల గుండెలు గుడిగా నిలిచిపోయే అరుదైన నటీమణి సావిత్రి!
బాటసారులులో భగ్న ప్రేమికురాలిగా, దేవదాసును మౌనంగా గుండెలో ఆరాధించిన దాసిగా పార్వతిగా,మాయా బజారులో శశిరేఖగా,మాయా శశిరేఖగా,పాండవ వనవాసం, నర్తన శాల లో ద్రౌపదిగా, మిస్సమ్మ లో మిస్ మేరీగా,గుండమ్మ కథ లో సవతి తల్లి ఆరళ్ళను సహనంతో భరించి ఆమెను మార్చిన సవతి కూతురిగా, మూగ మనసులు లో కట్టుబాట్ల, సంప్రదాయాల చట్రం కింద నలిగిపోయి సంఘర్షణ ను అనుభవించిన మూగ ప్రేమికురాలిగా, డాక్టర్ చక్రవర్తిలో అనుమానపు భర్తకు, తన కళను ఆరాధించే అభిమానికి మధ్యన నలిగిపోయిన సున్నితమైన స్త్రీ మూర్తిగా, కేవలం తనకు మాత్రమే సాధ్యమైన నవ్వుల కెరటాల తాకిడికి తనే నలిగిపోయిన లోతులు తెలియని గంభీరమైన సముద్రంవంటి మధురవాణి గా కన్యా శుల్కంలోను, ఇలా ఎన్ని పాత్రలలో ఆవిడ ఎంతగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిందో చెప్పడానికి ఎన్ని గ్రంధాలైనా సరిపోవు! ఆమె నిజ జీవితంకుడా మధురవాణి జీవితంలాగా ఆమెకూ, మనకు కూడా అర్థం కాని 'రిడిల్' గా నిలిచిపోయింది!!
గుంటూరు జిల్లా తెనాలి తాలూకా రావులపాలెంలో నిస్సంకర రావు గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు డిసెంబర్ 6,1937 జన్మించిన సావిత్రి శాస్త్రీయ నృత్యాన్ని,శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకొని విజయవాడ వంటి పట్టణాలలో నృత్య ప్రదర్శనలు కూడా ఇచ్చారు! వెండి తెర మీదనే కాక రంగస్థలం మీద కూడా నటిగా N.T.Rama rao గారి National Art Theatre తరపున, తను స్థాపించిన నవోదయ కళామండలి తరపునా అనేక ప్రదర్శనలు ఇచ్చి బుచ్చిబాబు గారి ఆత్మవంచన లో నాయకురాలిగా ఆనాటి రంగస్థల ప్రేక్షకులను ఉర్రూతలు వూగించారట! తెలుగు సిని పరిశ్రమలో కథా నాయకులతో పాటు సమానమైన ప్రఖ్యాతిని పొందిన తొలి, బహుశా, చివరి నటీమణి ఆమె! తెలుగు,తమిళం,కన్నడ,హిందీ భాషలలో మొత్తం 318 సినిమాలలో నటించిన సావిత్రి నిర్మాతగా, దర్శకురాలిగా కూడా తన ప్రతిభను చాటారు! వెండితెర జీవితంలో ఎంత విజయం సాధించిందో నిజ జీవితంలో అంతగా అపజయం పొందింది ఆమె! ఎందరు వద్దని సలహాలిచ్చినా వినకుండా జెమిని గణేషన్ ను వివాహం చేసుకొని , విఫలమై , బాధతోనే త్రాగుడికి,మత్తు పదార్ధాలకి బానిసై కేవలం 44 సంవత్సరాలకే 26.12.1981 నాడు మరణించింది.

తార జువ్వలా 'తారా' పథానికి దూసుకుని పోయి అలాగే నేలకు వ్రాలి పోయిన మహా నటీమణి తన బాధలను , అసంతృప్తిని నిరంతరం ఎదిరిస్తూనే ఎందరో విద్యార్థినీ విద్యార్థులు చదువుకోనడానికి ఎన్నో లక్షల రూపాయలను దానం చేశారు! ఒకసారి నాటి ప్రధాన మంత్రి లాల్ బహాదుర్ శాస్త్రి గారి వద్దకు లక్షల రూపాయల విలువైన తన బంగారు ఆభరణాలన్నీ ధరించి వెళ్లి , ఆయనతో కొంతసేపు మాట్లాడి వచ్చేముందు తన భరణాలన్నీ వొలిచి , ప్రధాన మంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు! క్రికెట్ క్రీడ ను విపరీతంగా అభిమానించిన సావిత్రి ప్రఖ్యాత వెస్ట్ ఇండీస్ ఆల్ రౌండర్ గ్యారీ సోబెర్స్ నీ ఎంతగానో ఆరాధించేవారు! స్వయంగా తాను కూడా ఎన్నో చారిటి మ్యాచ్ లలో క్రికెట్ ఆడారట ఆమె! చదరంగం కూడా చక్కగా ఆడేదట ఆవిడ, కాని, జీవిత చదరంగంలో మాత్రం విఫలమైనా, వొళ్ళు చూపించని వొద్దికైన నటీమణిగా శాశ్వతంగా తెలుగువారి , కాదు, సమస్త అభిమానుల గుండెలలో నిలిచి వుంటుంది ఆమె!


                                                                                              రచన : వనం వెంకట వర ప్రసాదరావు